: బెలూచిస్థాన్ నేత నోట ‘జైహింద్’ మాట!... చిక్కుల్లో పాకిస్థాన్ సర్కారు!
తాను ఆక్రమించిన కశ్మీర్ లో నిత్యం అల్లర్లకు ఆజ్యం పోస్తూ అక్కడి వారి చేత భారత వ్యతిరేక నినాదాలు చేయిస్తున్న పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రమేయం లేకుండానే పాక్ లో అంతర్భాగంగా ఉన్న బెలూచిస్థాన్ కు చెందిన కీలక రాజకీయవేత్త... ఆ దేశానికి వ్యతిరేకంగా, భారత్ కు అనుకూలంగా నేటి ఉదయం చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపనున్నాయి. భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి కీలక ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు ఆ దేశంలోని బెలూచిస్థాన్ కు కూడా స్వాతంత్ర్యం కావాల్సిందేనని ప్రకటించారు. మోదీ ప్రకటన క్షణాల్లో బెలూచిస్థాన్ లో కీలక రాజకీయ పార్టీగా ఉన్న బెలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) నేత అష్రఫ్ షెర్జాన్ చెవిన పడిపోయింది. వెనువెంటనే స్పందించిన ఆయన ‘జైహింద్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పాకిస్థాన్ కబంద హస్తాల నుంచి బెలూచిస్థాన్ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించిన షెర్జాన్... త్వరలోనే భారత్ తో కలిసి బెలూచిస్థాన్ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై బెలూచిస్థాన్ సమస్యను ప్రస్తావించారంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి షెర్జాన్ కృతజ్ఞతలు చెప్పారు. షెర్జాన్ వ్యాఖ్యలు పాకిస్థాన్ సర్కారును డైలమాలో పడేశాయి.