: మొక్కలు పెంచితే అదనపు మార్కులు: విద్యార్థులకు చంద్రబాబు ప్రోత్సాహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే విద్యార్థులకు పరీక్షల్లో అదనపు మార్కులు వేసి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ వరాన్ని ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మొక్కలు పెంచడం పవిత్ర కార్యక్రమమని, రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ గా మారాలని అభిలషించారు. నాటే ప్రతి మొక్కా ఏ విద్యార్థి నాటాడో రికార్డు చేస్తామని, దాని ఎదుగుదలను జియో ట్యాగింగ్ పద్ధతిలో పరిశీలిస్తూ ఉంటామని, దాన్ని బట్టి సదరు విద్యార్థికి అదనపు మార్కులు కలుపుతామని చంద్రబాబు వివరించారు. చదువుకున్న విద్యార్థులు విదేశాల వైపు చూడకుండా ఇక్కడే మెరుగైన ఉపాధిని కల్పించే సంస్థలను ఆహ్వానిస్తున్నామని వివరించారు. పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళితే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ సాంకేతికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సి వుందని, ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానని అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని చూసి ఎన్నో దేశ విదేశీ సంస్థలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు.