: పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్!... ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన!
భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ప్రసంగంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం ఏమాత్రం న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలో ఏపీకి కేంద్రం ఎంతమాత్రం సహకారం అందించలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేస్తామన్న హామీని కూడా మోదీ సర్కారు అమలు చేయలేదన్నారు. రెండేళ్లయినా ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ఊసే లేదన్నారు. ఆర్థిక లోటు భర్తీకి చిల్లిగవ్వ కూడా విదల్చలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టుకు సరిపడ నిధులివ్వడంలో కూడా కేంద్రం ఆసక్తి చూపడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.