: కేసీఆర్, కేవీపీల గుసగుసలు!... రోశయ్య మనవడి పెళ్లిలో ఆసక్తికర దృశ్యం!
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా ఉన్న కొణిజేటి రోశయ్య మనవడు అనిరుధ్ పెళ్లి వేడుకలో నిన్న ఆసక్తికర దృశ్యం కనిపించింది. హైదరాబాదులోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిన్న జరిగిన ఈ వివాహ వేడుకకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా హాజరయ్యారు. వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న సందర్భంగా ఒకే సమయంలో బయలుదేరిన కేసీఆర్, కేవీపీలు ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతేకాకుండా ఒకరి చెవిలో మరొకరు ఏదో విషయం చెప్పుకుంటూ గుసగుసలాడుకున్నారు. ఈ దృశ్యాన్ని అక్కడి వారు ఆసక్తిగా తిలకించారు.