: కేసీఆర్ సర్కారుకు దామోదర కితాబు!... పుష్కర ఏర్పాట్లు బాగున్నాయన్న మాజీ డిప్యూటీ సీఎం!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ... ఇద్దరు తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన వారే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దామోదర... నిన్నటిదాకా కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన తన స్వరం మార్చేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా నిన్న పాలమూరు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించారు. కృష్ణా పుష్కరాల నిర్వహణ సజావుగా సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అధికారులు చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.