: అమ్మ వచ్చిందన్న ఆనందంలో ఆగిన చిట్టితల్లి గుండె!
తల్లికి దూరంగా హాస్టల్ లో ఉంటున్న ఓ చిన్నారి, తన తల్లిని చూసిన ఆనందంలో గుండె ఆగి మరణించిన ఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లిలో జరిగింది. ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలో మరిన్ని వివరాలను చూస్తే, ఈడపు రమ, సమ్మయ్య దంపతులు తమ బధిరురాలైన కుమార్తె కావ్య (11)ను కరుణాపురంలో బధిరుల కోసం నడుపుతున్న పాఠశాలలో చదివిస్తూ, అక్కడే హాస్టల్ లో ఉంచి అప్పుడప్పుడూ చూసి వస్తుంటారు. నిన్న మధ్యాహ్నం రమ, తన కుమార్తెను చూసి వచ్చేందుకు వెళ్లింది. అప్పటివరకూ ఆడుకుంటున్న కావ్య, తన తల్లిని చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ వచ్చి రమ ఒడిలో వాలిపోయింది. బిడ్డను గట్టిగా కౌగిలించుకున్న రమ, ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగానే చేతుల్లో వాలిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. చాలా చురుకుగా, తెలివితేటలతో ఉండే కావ్య ఇలా దూరం కావడం తమను కలచివేస్తోందని పాఠశాల ప్రిన్సిపాల్ శాలిని ఆవేదన వ్యక్తం చేశారు.