: భాగ్యనగరిలో అర్ధరాత్రి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!... ఫ్రీడమ్ వాక్ చేసిన టెక్కీలు!
దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 1947, ఆగస్టు 15నే కదా అంటారా? తేదీ అందరికీ తెలుసు. సమయం ఎప్పుడు?... ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తర్వాత. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు హోరెత్తాయి. ఈ కారణం చేతనే భారత ప్రథమ పౌరుడి హోదాలో రాష్ట్రపతి ఆగస్టు 14 రాత్రే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ విషయం మనకు తెలిసినా అంతగా పట్టించుకోము. ఆగస్టు 15న తెల్లవారగానే సంబరాలు మొదలెడతాం. అయితే దీనిని భాగ్యనగరిలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు బాగానే ఒంటబట్టించుకున్నారు. నిన్న అర్ధరాత్రి మాదాపూర్ లో రోడ్డెక్కిన టెక్కీలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా టెక్కీలు రోడ్డుపై ‘ఫ్రీడమ్ వాక్’ పేరిట చేసిన మార్చ్ ఫాస్ట్ పలువురిని ఆకట్టుకుంది.