: కేజ్రీవాల్ పార్టీలో చేరిన 'గ్రేట్ ఖలీ'!
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఖలీ రాజకీయ రంగప్రవేశం చేయడం విశేషం. పంజాబ్ ఎన్నికల్లో విజయావకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో ఖలీ చేరాడు. పంజాబ్ యువతలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న గ్రేట్ ఖలీ 'ఆప్'లో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పంజాబ్ సీఎం అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఆప్ మరింత మంది ప్రముఖులు, నేతలకు గాలమేస్తున్నట్టు తెలుస్తోంది. ది గ్రేట్ ఖలీగా పేరొందిన దిలీప్ సింగ్ రాణా 7.1 అడుగుల ఎత్తుతో బలిష్టంగా ఉండి, రెజ్లింగ్ లో ప్రపంచస్థాయి ఆటగాడిగా కీర్తి సాధించాడు. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన రెజ్లింగ్ షోలో ప్రత్యర్థులను చిత్తుచేసి ఖలీ సత్తాచాటాడు. ఇంత పేరు సంపాదించిన ఖలీ ఆప్ ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఖలీని ఆప్ నేతలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.