: మాధవరెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలిసిందే!: ఉమా మాధవరెడ్డి
మాధవరెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను ఆరునెలల్లో ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలిసిందేనని మాజీ హోం మంత్రి ఉమామాధవరెడ్డి తెలిపారు. హైదరాబాదులో తన నివాసంలో ఆమె మాట్లాడుతూ, మాధవరెడ్డిని హత్య చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న తరువాత ఇతరులను హత్య చేయించాల్సిన అవసరం ఏంటని అడిగారు. నయీమ్ హత్య ఘటనలో పలు అనుమానాలున్నాయని ఆమె తెలిపారు. ఎన్నికల్లో తనకు నయీమ్ నిధులు సమకూర్చాడన్నది పూర్తి అవాస్తవమని ఆమె చెప్పారు. ఒకవేళ నయీమ్ వల్లే గతంలో తాను గెలిచి ఉంటే, గత ఎన్నికల్లో తాను ఎందుకు పరాజయం పాలయ్యానని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలను రక్షించుకునే క్రమంలో తమలాంటి వారిపై ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆమె చెప్పారు. తాము తప్పు చేసి ఉంటే విచారణలో తేలుతుందని ఆమె తెలిపారు. సాక్షాత్తూ డీజీపీగా పని చేసిన వ్యక్తి... ఇలాంటి మాజీ నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా చేసుకుని, కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వెళ్లిపోతామని అన్నారని ఆమె గుర్తు చేశారు. తమకు, నయీమ్ కు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు.