: నయీమ్ మా 28 ఎకరాల భూమిని తీసుకుని, మా కుటుంబ సభ్యులను చంపేశాడు: ఓ బాధితురాలు ఫిర్యాదు
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ దారుణాలకు బలైపోయిన బాధితులు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. నయామ్ భూకబ్జాలపై దేశ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రధానంగా హైదరాబాదులోని ఎల్బీనగర్, ఇబ్రహీం పట్నం, ఆదిభట్లలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. 12 ఏళ్ల క్రితం నయీమ్ తన 28 ఎకరాల భూమిని లాగేసుకున్నాడని, ఆ క్రమంలో తన భర్త, కుమారుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడని మల్లమ్మ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదిభట్లలో తమ బంధువులను కూడా భయబ్రాంతులకు గురిచేసి భూకబ్జాలకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది. కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఇతరుల ఇళ్లలో పాచిపని చేసి జీవనం సాగిస్తున్నానని ఆమె చెప్పింది.