: 9 మంది పిల్లల్ని కంటే స్వర్ణం, ఏడుగురైతే రజతం, ఐదుగురైతే కాంస్యం...ఏ దేశంలోనో తెలుసా?


ఒలింపిక్స్ లో పిల్లల్ని కనే పోటీలు కూడా ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి పోటీలు లేవు కానీ, ఫ్రాన్స్ లో 'మెడల్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఫ్యామిలీ' పేరుతో 1920 నుంచి ఒక చట్టం అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం ఒలింపిక్స్ లో పతకాల తరహాలో కుటుంబం సైజ్ ను బట్టి ప్రభుత్వం పతకం ప్రదానం చేస్తుంది. కుటుంబంలో దంపతులు ఎనిమిది నుంచి తొమ్మిది మంది పిల్లల్ని కంటే వారికి స్వర్ణపతకం ప్రదానం చేస్తుంది. అలాగే ఆరు నుంచి ఏడుగురు పిల్లల్ని కంటే వారికి రజత పతకం అందజేస్తుంది. నాలుగు నుంచి ఐదుగురు పిల్లల్ని కంటే కాంస్య పతకం ఇస్తుంది. అంతకంటే తక్కువ మందితో సరిపెట్టుకుంటే ఆ కుటుంబాన్ని సాధారణ కుటుంబంగా పరిగణించి వారికి ఎలాంటి పతకం ప్రదానం చేయదు. ఫ్రాన్స్ ప్రభుత్వం అందజేసే ఈ పతకాలపై పిల్లల రూపాలు ఉంటాయి. ఈ పతకం పొందడానికి అభ్యర్థులు దరఖాస్తును స్థానిక కార్యాలయంలో అందజేయాలి. ఈ దరఖాస్తు పరిశీలించిన అధికారులు వారి కుటుంబంపై పూర్తిగా దర్యాప్తు చేస్తారు. పిల్లలంతా సక్రమ సంతానమే అని తేలిన తర్వాతే పతకానికి ఎంపిక చేస్తారు. ఈ చట్టానికి సవరణలు చేసి పతకం పేరును 'మెడల్‌ ఆఫ్‌ ద ఫ్రెంచ్‌ ఫ్యామిలీ'గా మార్చారు. దీంతో ఈ పతకం పరిధిలోకి భర్త మరణించినా లేక వదిలేసిన మహిళ మరో వ్యక్తిని వివాహం చేసుకుని అతని ద్వారా మరికొంతమంది పిల్లల్ని కని వారి పోషణ భారం చూస్తున్నా ఈ పతకానికి అర్హులు కావడం విశేషం. అంతేకాదు, ఆనాథ పిల్లల్ని చేరదీసి పెంచుతున్నా వారు కూడా ఈ పతకానికి అర్హులు అని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడం విశేషం.

  • Loading...

More Telugu News