: శ్రీశైలం నుంచి హంసలదీవి వరకూ కిటకిట... 21 లక్షల మంది పుణ్యస్నానాలు


వరుస సెలవులు పుష్కర యాత్రికులను నదీమ తల్లి వద్దకు నడిపించడంతో, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పుష్కర ఘాట్లూ కిటకిటలాడుతున్నాయి. ఈ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఏపీలోని పుష్కర ఘాట్లలో 21 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, సాయంత్రానికి మరో 15 నుంచి 16 లక్షల మంది స్నానాలు చేస్తారని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. రేపు కూడా ఇదే తరహాలో రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. అదివారం తెల్లవారుఝాము నుంచే శ్రీశైలం నుంచి హంసలదీవి (కృష్ణానది సముద్రంలో కలసే ప్రదేశం) వరకూ ఏర్పాటైన అన్ని ఘాట్లలో యాత్రికుల సందడి కనిపించింది. మరోవైపు విజయవాడలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం, పుష్కర నగర్ ల నుంచి వివిధ ఘాట్లకు చేరుకోవాల్సిన వారు దాదాపు 2 కిలోమీటర్ల వరకూ నడిచి వెళ్లాల్సి రావడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ ఉచిత బస్సులను ఏర్పాటు చేసినా వాటి సంఖ్య చాలలేదని సమాచారం. ఒక్కో బస్సు గరిష్ఠంగా ఒక్కో ట్రిప్పులో 70 నుంచి 80 మందిని మాత్రమే ఘాట్ల వద్దకు చేరుస్తోంది. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు బస్సులు సరిపోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేసినా, అన్నింటిలోనూ భక్తులు అమ్మ దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి వుంది. దర్శనానికి మూడు నుంచి ఐదు గంటల సమయం క్యూ లైన్లలో ఉండాల్సి రావడం భక్తులను ఇబ్బంది పెడుతోంది. ఎండవేడికి తాళలేక పలువురు సొమ్మసిల్లి పడిపోగా, వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తడంతో, దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News