: పనిలో పనిగా చూసొస్తున్నారు... వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి 'పుష్కర' సందడి
నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం పరిసరాలు పుష్కర భక్తుల రాకతో సందడిగా మారాయి. వెలగపూడి పరిసరాల్లో తాళ్లాయపాలెం, వెంకటపాలెం, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, రాయపూడి గ్రామాల్లో నిర్మించిన ఘాట్లలో పుణ్యస్నానాల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పుష్కర భక్తులు, పనిలో పనిగా తాత్కాలిక సచివాలయాన్ని చూసి పోదామని ఇక్కడికి వస్తుండటంతో ఈ ప్రాంతం కిటకిటలాడుతోంది. యువతీ యువకులు సచివాలయం భవనాల ముందు సెల్ఫీలు దిగుతూ ఆనందిస్తుండటంతో, ఈ ప్రాంతం పర్యాటక కళను సంతరించుకుంది. అయితే, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, పోలీసులు వాహనాలను సచివాలయం వరకూ అనుమతించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంతో తాము చాలా దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆరోపించారు.