: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా నది... రంగంలోకి రెస్క్యూ టీములు
హర్యానాలోని జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో, ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా రెస్క్యూ టీములు రంగంలోకి దిగాయి. ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి కపిల్ మిశ్రా దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. నీరు ప్రమాదకర స్థాయికి దగ్గరగా ప్రవహిస్తోందని, బురారీ ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించామని ఆయన తెలిపారు. నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీములన్నీ సిద్ధంగా ఉన్నాయని, వరద విభాగంలోని టీములకు రాత్రిపూట డ్యూటీలు వేశామని ఆయన తెలిపారు. ఐదు జిల్లాల టీములను సిద్ధంగా ఉంచామని, యమునలో 204.83 మీటర్ల స్థాయిలో నీరు ప్రవహిస్తే, అది ప్రమాదకరమని, ప్రస్తుతం 204 మీటర్లకు నీటి ప్రవాహం చేరిందని ఆయన అన్నారు.