: యాదగిరిని చంపాలని కాల్చలేదు: నేటి ఉదయం కాంగ్రెస్ నేతపై కాల్పులు జరిపిన డక్కల బాబు


మాదిగోళ్ల దగ్గర అడుక్కు తిని బతికే డక్కల జాతి తమదని, తాను అలాగే బతికానని నేటి ఉదయం హైదరాబాదులోని బోయిన్ పల్లిలో కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపిన డక్కల బాబు తెలిపాడు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తిండికి లేని నిరుపేద బతుకు తనదని తెలిపాడు. భూకబ్జాలు చేశానని, రౌడీయిజం చేశానని, భూ వివాదం కారణంగా అతనిపై కాల్పులు జరిపానని తనపై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయని, తన పేరు మీద అంగుళం భూమి ఉన్నా తీసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. యాదగిరి కాంగ్రెస్ నేత కాకముందు ఆయన వద్ద తాను ఫైనాన్స్ కలెక్షన్ బాయ్ గా పని చేశానని చెప్పారు. అప్పటి నుంచి ఆయన వేధింపులు భరిస్తున్నానని ఆయన తెలిపారు. ఆ తరువాత 21 ఏళ్ల క్రితం తానో తప్పు చేశానని, అప్పటి నుంచి పోలీసుల వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఆ తరువాత తప్పు చేయకూడదని చాలా ప్రయత్నించానని, అలా ప్రయత్నించిన ప్రతిసారి పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసేవారని ఆయన చెప్పారు. పోలీసుల్లో మంచి వాళ్లు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ కు సంతకం చేయడానికి తాను వెళ్తే... తనను చితక్కొట్టి పంపేవారని అన్నారు. పోలీసు డిపార్ట్ మెంట్ లో కొంత మంది అకారణంగా తనను దోషిని చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను చేసిన తప్పులకు తనను ఎన్ కౌంటర్ చేసినా తప్పులేదని, అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని, ఆమెకు ఆశ్రయమిచ్చిన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆయన చెప్పారు. తాను యాదగిరిని హత్య చేయాలంటే క్షణకాలం కూడా పట్టేది కాదని, అయితే ఆయనను హత్య చేయాలన్నది తన ఉద్దేశం కాదని, అతనిని భయపెట్టాలని మాత్రమే అనుకున్నానని ఆయన తెలిపారు. తరువాత బాత్రూంలో దూరిన అతనికి ఒక తుపాకీ ఇచ్చి, తనను కాల్చుకోవాలని సవాల్ విసిరానని ఆయన తెలిపారు. ఆయన భయపడి దాక్కున్నాడని ఆయన తెలిపారు. తాను కాల్పులు జరిపిన తపంచాను ఉత్తరప్రదేశ్ లో 7 వేల రూపాయలకు కొనుగోలు చేశానని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో పోలీసులకు లొంగిపోతానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News