: నయీమ్ తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు... పార్టీ పేరు వాడాల్సిన అవసరమూ లేదు: దినేష్ రెడ్డి
ఎన్ కౌంటర్ కు గురై తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న గ్యాంగ్ స్టర్ నయీమ్ క్రిమినల్ రికార్డుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, నయీమ్ అంశంలో తన ప్రమేయం లేనప్పుడు తనకు పార్టీ పేరు వాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు వచ్చినవన్నీ లీకులు, ఆరోపణలు మాత్రమేనని ఆయన చెప్పారు. సిట్ విచారణతో అన్నీ బయటకు వస్తాయని ఆయన చెప్పారు. ఇక వ్యాస్ హత్య గురించి ఇంతకు ముందు పలు మార్లు చెప్పినప్పటికీ... 1993 జనవరి 25న వ్యాస్ ఆహ్వానంతో తాను స్టేడియంలో జాగింగ్ కు వెళ్లానని అన్నారు. అంతకు ముందు హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో తామిద్దరం జాగింగ్ చేసేవారమని, అక్కడ పొగ వస్తుండడంతో ఆయన స్టేడియంకు వెళ్లేవారని, ఆయన పిలవడంతోనే తాను ఓ రోజున ఆయనతో కలిసి స్టేడియంలో జాగింగ్ కు వెళ్లానని అన్నారు. అయితే అక్కడ వ్యాస్ గన్ మెన్లు, తన గన్ మెన్లను చూసిన నయీమ్ ముఠా అతనిని చంపలేకపోయారని అన్నారు. ఆ తరువాతి రోజు రిపబ్లిక్ డే కావడంతో ఫుల్ సెక్యూరిటీతో ఉన్నామని ఆ రోజు కూడా ఏమీ కాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. జనవరి 27న తామిద్దరం జాగింగ్ చేస్తుండగా, బాగా అలసిపోయిన తాను వ్యాస్ భార్యతో మాట్లాడుతూ వెనక ఉండిపోగా, 400 గజాల దూరంలో ఉన్న వ్యాస్ ను ఎటాక్ చేసి హత్య చేశారని, ఈ ఘటనలో తాను నిర్దోషినని తేలిందని ఆయన చెప్పారు.