: నాడు ఆత్మహత్యలో ఫెయిలయ్యాడు... నేడు ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకున్నాడు!
జీవితం అంటే అదే... మనం ఊహించింది జరగదు. ఊహించనిది జరుగుతుంది. అమెరికా స్విమ్మర్ ఆంటోనీ ఎర్విన్ విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవడంలో విఫలమైన ఆంటోనీ, ఇప్పుడు రియో ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించడంలో సఫలమయ్యాడు. ఎర్విన్ 2004 సిడ్నీ ఒలింపిక్స్ తో కెరీర్ ను ప్రారంభించాడు. ఆ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడంతో 19 ఏళ్లకే స్వర్ణపతకం సొంతం చేసుకున్న ఆటగాడిగా అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత 2006లో స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పాడు. అప్పటికే టోరెట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడే ఎర్విన్... ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. డ్రగ్స్ సేవించి బైక్ తీసుకుని నచ్చినట్టు నడిపేవాడు. దీంతో అధికారులకు పలుమార్లు పట్టుపడ్డాడు. వారు అతనిని గుర్తించి హెచ్చరించి వదిలేసేవారు. కొన్నిసార్లు జరిమానాతో తప్పించుకున్నాడు. ఒక దశలో సన్నిహితుల సలహామేరకు మ్యుజిషియన్ గా మారాలని సంగీతం స్కూల్ లో జాయినయ్యాడు. అయితే అది అతని వల్ల కాకపోవడంతో మధ్యలోనే మానేశాడు. దీంతో మళ్లీ డ్రగ్ అడిక్ట్ గా మారాడు. ఈ క్రమంలో మళ్లీ వాటి నుంచి విముక్తి కోసం ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అలా అది సఫలమవ్వకపోవడంతో జీవితంలో తను మారాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మళ్లీ సుదీర్ఘ విరామం తరువాత స్విమ్మింగ్ పూల్ లో దిగి శిక్షణ ప్రారంభించాడు. మళ్లీ జీవితం గాడినపడడం ప్రారంభించింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో 50 మీటర్ల ప్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో అమెరికా తరపున పాల్గొని 5వ స్థానంలో నిలిచాడు. దీంతో మళ్లీ పట్టుదలగా శ్రమించి రియో ఒలింపిక్స్ లో 400 మీటర్ల రిలేలో, 50 మీటర్ల ప్రీస్టైల్ విభాగంలో స్వర్ణపతకాలు సాధించి సత్తా చాటాడు.