: బాలీవుడ్ టాప్ 5 లో మూడు అక్షయ్ సినిమాలే!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. గతంలో విడుదలైన సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత గ్రేట్. ఇప్పుడు ఎన్ని ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేస్తే అంత గ్రేట్. ఇక కలెక్షన్ల సంగతంటారా? తొలి రోజు కలెక్షన్లే సినిమా హిట్టా? ఫట్టా? అన్నది చెప్పేస్తున్నాయి. ఈ తొలి రోజు బిజినెస్ ను గుర్తించిన నిర్మాతలు కూడా తొలిరోజు విడుదలయ్యే థియేటర్లపైనే దృష్టిపెడుతున్నారు. దీంతో అన్ని భాషల చిత్ర పరిశ్రమలూ తొలిరోజు కలెక్షన్లలపైనే దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్ సాధించిన బాలీవుడ్ సినిమాల లిస్టును బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ విడుదల చేశాడు. బాలీవుడ్ లో తొలి రోజు కలెక్షన్లలో టాప్ ఐదు సినిమాల్లో మూడు అక్షయ్ కుమార్ సినిమాలే ఉండడం విశేషం. 'సుల్తాన్' తొలి రోజు 36.54 కోట్లు వసూలు చేయగా, షారూఖ్ 'ఫ్యాన్' 19.20 కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకుంది. మూడో సినిమాగా అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్-3' 15.21 కోట్ల రూపాయలు, నిన్న విడుదలైన 'రుస్తుం' సినిమా 14.11 కోట్ల రూపాయలు, టాప్ ఫైవ్ సినిమాగా 'ఎయిర్ లిఫ్ట్' 12.35 కోట్ల రూపాయలు వసూలు చేశాయని చెప్పాడు.