: బానిస కార్మిక వ్యవస్థ పీడ ఆధునిక ప్రపంచంలోనూ అధికమే.. 60 శాతం దేశాల్లో కొనసాగుతున్న వైనం
బానిస కార్మిక వ్యవస్థ.. అనాది కాలం నుంచి పేద, మధ్య తరగతి ప్రజలని పీడిస్తోన్న విధానం. మనుషులను అక్రమంగా తరలించి వారితో బలవంతంగా పనులు చేయించడం, అప్పులిచ్చి, దౌర్జన్యంగా పెళ్లి చేసుకొని పనులు చేయించుకోవడం ఈ విధానంలోని చర్యలు. ఈ క్రమంలో వారిని చిత్రహింసలకు గురిచేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. అయితే, నేటి ఆధునిక ప్రపంచంలోనూ బానిస కార్మిక వ్యవస్థ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోని 60 శాతం దేశాల్లో ఈ వ్యవస్థ కొనసాగుతోందని బ్రిటన్‌కు చెందిన ‘వియ్‌రిస్క్ మాప్లెక్రాఫ్ట్’ కన్సల్టెంట్ సంస్థ తాజాగా పేర్కొంది. ఆధునిక బానిస కార్మిక వ్యవస్థపై 198 దేశాల్లో తాము అధ్యయనం చేసినట్లు సంస్థ పేర్కొంది. ఆయా దేశాల్లోని 115 దేశాల్లో బానిస కార్మికులు అధికంగా ఉన్నారని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రపంచంలో 4.60 కోట్ల మంది కార్మికులు బానిస వ్యవస్థలో చిక్కుకుపోయి బాధలుపడుతున్నారని ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ 2016 గ్లోబల్ నివేదికలో పేర్కొంది. బానిస కార్మిక వ్యవస్థలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారని ‘వియ్‌రిస్క్ మాప్లెక్రాఫ్ట్’ కన్సల్టెంట్ సంస్థ తెలిపింది. ఉత్తర కొరియాలో ఈ వ్యవస్థ అత్యధికంగా ఉందని తెలిపింది. ఉత్తర కొరియా తరువాత సౌత్ సూడాన్, సూడాన్, డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాల్లో ఈ వ్యవస్థ అధికమని పేర్కొంది. బ్రిటన్, జర్మనీ, ఫిన్‌లాండ్, డెన్మార్క్ దేశాల్లో అన్ని దేశాల్లోకెల్లా బానిస కార్మిక వ్యవస్థ తక్కువగా ఉందని తెలిపింది. బానిస వ్యవస్థను నిర్మూలించేందుకు బ్రిటన్ పలు చర్యలు తీసుకుంటుండడంతో అక్కడ విధానం చాలా తక్కువగా ఉంది. చైనా, భారత్ లాంటి దేశాల్లో బానిస కార్మిక వ్యవస్థ ఓ మోస్తరుగా ఉందని పేర్కొంది. దీన్ని నిరోధించేందుకు పలు దేశాల్లో కఠిన చట్టాలు ఉన్నాయని, కానీ అవి సమర్థవంతంగా అమలుకాకపోవడం వల్ల ఈ వ్యవస్థ పెరిగిపోతోందని తెలిపింది.