: అత్యంత ఉష్ణోగ్రతను తట్టుకునే అద్భుత పదార్థాన్ని తయారు చేసిన చైనా
అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన 'ఏరోజెల్'ను కనిపెట్టి సైన్స్ లో ముందడుగు వేసిన చైనా, అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతనూ తట్టుకోగల పదార్థాన్ని సృష్టించింది. ఇప్పటి వరకు తయారు చేసిన లోహాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొనే లోహమిదేనని ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సీనియర్ ఇంజనీర్ జు జంగ్ ఫెంగ్ ప్రకటించారు. అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, స్పేస్ క్రాఫ్ట్ లు, శాటిలైట్ల తయారీలో ఈ లోహాన్ని వినియోగించవచ్చని ఆయన తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగాములమని చెప్పుకుంటున్న అమెరికా, రష్యా, కొన్ని యూరోపియన్ దేశాలు తమ పరిశోధనల్లో ఏరోజెల్ ను వినియోగిస్తున్నాయని, ఇప్పుడు తాము తయారు చేసిన పదార్థం దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోవడంతో పాటు వైబ్రేషన్ ను కూడా తట్టుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ పదార్థంతో అంతరిక్ష పరిశోధనలు మరింత కొత్త పుంతలు తొక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.