: కదులుతున్న ట్రైన్ ముందు సెల్ఫీ తీసుకుంటే ఐదేళ్లు జైలుకి వెళ్లాల్సిందే!
సెల్ఫీ మోజులో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న యువత చర్యలకి అడ్డుకట్టవేసేందుకు భారత రైల్వే శాఖ నడుంబిగించింది. రైల్వే ట్రాక్ ల పైనా, నడిచే ట్రైన్ల ముందు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించే వారు ఇకపై ఆ చర్యలు ఆపేయాల్సిందే. ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ హెచ్చరిస్తోంది. ఇటువంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 లోని మూడు సెక్షన్లను అమలు చేసేందుకు సన్నద్ధమైంది. రైల్వే స్టేషన్లో సెల్ఫీ తీసుకున్న వారిపై 'రైల్వే యాక్ట్ 1989'ను నమోదు చేయాలని, దాని ప్రకారం ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడేలా చూడాలని అహ్మదాబాద్ డివిజన్ రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం సెల్ఫీల్లో కేవలం రైల్వే ట్రాక్ లు కనిపిస్తే 147, ట్రాక్ తో పాటు ట్రైన్ కూడా ఉంటే 145, 147 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు కానున్నాయి. కదులుతున్న రైలు, గూడ్స్ బ్యాగ్రౌండ్ లో ఉండేలా సెల్ఫీ తీసుకున్నా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయనున్నారు. కదులుతున్న ట్రైన్ ముందు ప్రమాదకరంగా పలువురు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి వారిపై 153 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పట్టుబడ్డ వారికి సుమారు 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని చెప్పారు.