: ఇరోమ్ షర్మిల పోరాటాన్ని ఎల్లుండి నుంచి నేను కొనసాగిస్తా.. ఉక్కుమహిళ బాటలో మరో మహిళ
మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల బాటలో నడవాలని నిర్ణయించుకున్న ఓ మహిళ నిరవధిక నిరాహార దీక్షకు సన్నద్ధమవుతోంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 16 ఏళ్లుగా కొనసాగించిన నిరాహార దీక్షను ఇటీవలే ఇరోం షర్మిల విరమించిన విషయం విదితమే. ఇప్పుడు ఆమెలాగే పోరాటం చేయాలని ఆరంబం రోబిత లీమా అనే 32 ఏళ్ల మహిళ నిరవధిక దీక్షకు సన్నాహాలు చేస్తోంది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కమ్యునిటీ హాల్ లో ఎల్లుండి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగనున్నట్లు రోబిత లీమా పేర్కొన్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను రద్దు చేసి ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) వ్యవస్థను అమలు చేయాలని ఆమె కోరుతున్నారు. తాను ఎంతగానో అభిమానించే ఇరోం షర్మిల చేసి ఆపేసిన పోరాటాన్ని తాను కొనసాగిస్తానని ఆమె అన్నారు. అయితే, రోబితకు డైమండ్(10), తంపామణి(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారి ఆలనాపాలనా చూసుకోవడం కోసమైనా రోబిత తన నిర్ణయాన్ని పక్కకు పెట్టాలని పలు మహిళా సంఘాలు సూచించాయి. దీనికి రోబిత ససేమిరా అన్నారు.