: స్వయంగా రంగంలోకి దిగిన నాగిరెడ్డి!... నయీమ్ కేసులో మూడు జిల్లాల ఖాకీలతో సిట్ చీఫ్ కీలక భేటీ!
గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారాలకు సంబంధించి గుట్టు విప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ నాగిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం తన సెల్ నెంబరును ప్రకటించిన నాగిరెడ్డికి నయీమ్ బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పలువురు రాజకీయ నేతలతో నయీమ్ సంబంధాలు నెరిపినట్లు కీలక ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ ఏసీబీ ఆఫీసులో నాగిరెడ్డి నేటి ఉదయం కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిట్ సభ్యులతో పాటు నల్లగొండ జిల్లాలోని నయీమ్ సొంతూరు భువనగిరి, హైదరాబాదు పరిధిలోని నార్సింగి, మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ పోలీసులు కూడా హాజరయ్యారు.