: అమెరికాలో అడుగుపెట్టనని షారూక్ అని అంటే బాగుండేది: శివసేన
ఈ విధంగా తనను అవమానిస్తే ఇకపై అమెరికాలో అడుగుపెట్టనని చెప్పి బాలీవుడ్ నటుడు స్వదేశానికి తిరిగొచ్చేస్తే బాగుండేదని శివసేన పార్టీ అభిప్రాయపడింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో షారూఖ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు నిన్న అదుపులోకి తీసుకోవడంపై శివసేన స్పందిస్తూ పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఈ మేరకు సంపాదకీయం రాసింది. అమెరికాలోని విమానాశ్రయాల్లో షారూక్ ఖాన్ ను నిర్బంధించడం సాధారణ విషయంగా మారిందని పేర్కొంది. షారూక్ కి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నప్పటికీ అక్కడికి వెళుతూనే ఉన్నారని ఎద్దేవా చేసింది. నిన్న ఈ సంఘటన జరిగిన వెంటనే ఇక మీ దేశంలో ఇక అడుగుపెట్టనంటూ ఆయన స్వదేశానికి తిరిగొచ్చేసి ఉంటే అమెరికా ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్లుగా ఉండేదని అభిప్రాయపడింది. కాశ్మీర్ లో పెడదోవ పడుతున్న యువతకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యతను షారూక్ తీసుకోవాలని ఈ సందర్భంగా శివసేన కోరింది.