: సిట్ చీఫ్ నాగిరెడ్డి మొబైల్ కు వెల్లువలా ఫోన్లు!... అన్నీ నయీమ్ పై ఫిర్యాదులేనట!
గ్యాంగ్ స్టర్ నయీమ్ గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ నాగిరెడ్డి మొబైల్ నెంబరు (94406 27218)కు మొన్న రాత్రి నుంచి కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. నయీమ్ బతికున్నంత కాలం అతడికి భయపడి నోరు మెదపని అతడి బాధితులు అతడు చనిపోగానే తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే నాగిరెడ్డికి ఫోన్ చేస్తున్నారు. గురువారం రాత్రి నాగిరెడ్డి తన నెంబరును ప్రకటించగా... నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ తరహా కాల్స్ ఏకంగా 14 వచ్చాయట. ప్రతి గంటకు ఓ కాల్ వస్తోందని చెబుతున్న పోలీసులు... నయీమ్ తమను ఎంతగా ఇబ్బంది పెట్టాడో బాధితులు చెబుతూ అతడిపై ఫిర్యాదు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక నాగరెడ్డికి ఫోన్ చేసేందుకు కాస్తంత జంకుతున్న మరికొందరు సిట్ కార్యాలయానికి లేఖలు రాస్తున్నట్లు సమాచారం. వెరసి నయీమ్ బాధితులంతా బయటకు వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.