: నయీమ్ డైరీలో మరో మాజీ మంత్రి?... పక్కపక్కనే గ్యాంగ్ స్టర్, మాజీ మంత్రి ఫామ్ హౌస్ లు!
సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత మరింత సంచలనం రేకెత్తించే అంశాలు వెలుగు చూస్తున్నాయి. మావోయిస్టు దళ సభ్యుడి నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన నయీమ్ ను గత వారం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు మట్టుబెట్టారు. ఆ తర్వాత నుంచి అతడి ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తూనే వున్నారు. ఈ సోదాల్లో భాగంగా అతడు రాసుకున్నట్లుగా భావిస్తున్న పలు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డికి నయీమ్ తో సంబంధాలున్నాయన్న కథనాలు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. అయితే నయీమ్ తో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఉమా మాధవరెడ్డి తేల్చిచెప్పేశారు. తాజాగా నయీమ్ తో హైదరాబాదుకు చెందిన ఓ మాజీ మంత్రికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ తో సంబంధాలు కొనసాగించిన సదరు రాజకీయవేత్త హైదరాబాదు శివారులో ఏకంగా 3 వేల ఎకరాలను కబ్జా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నయీమ్ తన అభిరుచులకు అనుగుణంగా కట్టించుకున్న ఫామ్ హౌస్ ను ఆనుకుని మాజీ మంత్రి కూడా మరో ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారట. సదరు మాజీ మంత్రితో నయీమ్ కు ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు సేకరించిన సిట్ పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.