: ఏబీకేకు సుప్రీం తలంటు!... అమరావతి నిర్మాణానికి అడ్డంకులేంటని ఆగ్రహం!
తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ కు నిన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఏబీకే... దానిపై సీబీఐ చేత సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని, సదరు దర్యాప్తును సుప్రీంకోర్టే ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని పిటిషన్ దాఖలు చేశారు. నిన్న దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఏబీకేకు షాకిచ్చే కామెంట్లు చేసింది. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ఇలాంటి చర్యలను తాము ప్రోత్సహించమని చెప్పిన కోర్టు... అసలు పిటిషన్ వేయడానికి మీరెవరంటూ ఆయనను నిలదీసింది. అమరావతి ఎక్కడ కట్టాలో మీరే చెబుతారా? తామే కట్టుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే అడ్డుకుంటారా? అంటూ ఆయనపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అయినా ఈ పిటిషన్ వేయడానికి మీకు అర్హత ఉందా? అని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించడంతో ఏబీకే తరఫు న్యాయవాది తెల్లమొహం వేశారు. రాజధానికీ, మీకూ సంబంధం ఏమిటీ? మీరు రైతా? అక్కడ భూములు కోల్పోయారా? అని జడ్జీలు ప్రశ్నించారు. అమరావతితో ఏమాత్రం సంబంధం లేని ఏబీకే ప్రసాద్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పారు. ఏబీకే పిటిషన్ ను తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించిన ధర్మాసనం... భూములు కోల్పోతున్న రైతులెవరైనా పిటిషన్ వేస్తే... దీనిపై విచారణ జరపాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చుతామని చెప్పారు.