: ఇండిపెండెన్స్ డే నాడు ఢిల్లీ, నోయిడాల్లో విధ్వంసం?... ఆగంతుకుడి ఫోన్ తో పోలీసుల అలర్ట్!
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర మూకలు రంగంలోకి దిగాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సమీపంలోని నోయిడాకు చెందిన అమిత అనే వ్యక్తికి నిన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశ రాజధాని ఢిల్లీ సహా నోయిడాలోనూ పేలుళ్లు జరగనున్నాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన అమిత వెనువెంటనే సదరు విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. అమిత నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు ప్రారంభించారు. అదే సమయంలో రెండు నగరాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సదరు ఫోన్ కాల్ వచ్చిందని తేలింది.