: మీ కోసం మళ్లీ మళ్లీ మళ్లీ పుట్టాలని ఉంది: జూనియర్ ఎన్టీఆర్
ప్రతిసారీ అభిమానుల రుణం తీర్చుకుంటానని చెబుతుంటాను కానీ, అది తీరేలా కనిపించడం లేదని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, అభిమానులు చూపించే ఈ ప్రేమ కోసం మళ్లీ మళ్లీ మళ్లీ పుట్టాలని ఉందని అన్నాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ మహానుభావుడికి మనవడిగా, అద్భుతమైన వ్యక్తికి కొడుకుగా పుట్టానని, ఇంత మంది ప్రేమకు పాత్రుడనయ్యానని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ ప్రేమ కోసం మళ్లీ మళ్లీ పుట్టాలని అనిపిస్తుందని తెలిపాడు. 'నిన్ను చూడాలని' సినిమా చేసినప్పుడు ఏం చేస్తున్నానో, ఎందుకు నటిస్తున్నానో తెలిసేది కాదని అన్నాడు. చాలా సినిమాలు చేస్తున్నంత కాలం ఇదే పరిస్థితి ఎదురైందని జూనియర్ తెలిపాడు. తరువాత 'టెంపర్'తో మిమ్మల్ని ఆనందపరచగలిగానని అన్నాడు. ఆ తరువాత 'నాన్నకు ప్రేమతో' సినిమాతో తన గమ్యం తెలిసిందని తెలిపాడు. 'జనతా గ్యారేజ్' సినిమాతో తన గమ్యానికి మరింత చేరువయ్యానని ఆయన చెప్పాడు. రెండేళ్ల క్రితం తాను ఫ్లాపుల్లో వున్నప్పుడు, కొరటాల శివ సినిమా కథ చెప్పగా విన్నానని, అప్పుడు చేయడానికి ధైర్యం చేయలేదని ఆయన గుర్తు చేేసుకున్నాడు. పుష్కర కాలంలో తనకు కొరటాల శివ పెద్ద హిట్ ను ఇస్తాడని అన్నాడు. ఒక అద్భుతమైన కథను, రచయిత కోణంలో రాసి, దర్శకుడి దృష్టితో కొరటాల శివ తీశాడని ఆయన తెలిపారు. ఈ సినిమా ద్వారా తాను ఓ గొప్ప నటుడిని కలవడం కంటే, ఓ గొప్ప మనిషిని కలిశానని; గొప్ప మనిషి కంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కలిశానని...ఆ వ్యక్తి మోహన్ లాల్ అని ఎన్టీఆర్ అన్నాడు. పని పట్ల దేవిశ్రీ ప్రసాద్ కు ఉండే తపన ఇంకెవరికీ ఉండదని చెప్పాడు. పుష్కరాలకు వచ్చే ఇతర రాష్ట్రాల వారికి తెలుగుదనం ఉట్టిపడేలా స్వాగతం చెప్పి... తెలుగుదనం ఎంత గొప్పదో తెలుసుకునేలా చేయాలని ఆయన అభిమానులను కోరాడు.