: ప్రముఖ సంగీత విద్వాంసుడు అమ్జద్ అలీ ఖాన్ కు యూకే వీసా తిరస్కరణ
మన దేశానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు అమ్జద్ అలీఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ లో లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్ లో జరగనున్న ఓ సంగీతకచేరికి ఆయన హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యూకే వీసా కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఊహించని విధంగా ఆయన వీసాను యూకే అధికారులు తిరస్కరించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన సరోద్ విద్వాంసుడు అమ్జద్ అలీ ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, లండన్ లోని ఇండియన్ హై కమిషన్ కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. యూకే అధికారుల తీరుతో తాను తీవ్ర దిగ్భ్రాంతి చెందానని ఆయా ట్వీట్లలో తెలిపారు. కళాకారులకు ఈ విధంగా జరగడం చాలా విచారకరమని, 1970 నుంచి ప్రతి ఏటా తాను యూకేలో ప్రదర్శనలిస్తున్నానని, ఇప్పుడు తన వీసా దరఖాస్తును యూకే అధికారులు తిరస్కరించడం నిరాశకు గురి చేసిందని ఆయా ట్వీట్లలో తన ఆవేదన వ్యక్తం చేశారు.