: ‘రియో’కి వెళ్లి చిక్కుల్లో పడ్డ కేంద్ర మంత్రి విజయ్ గోయల్
రియో ఒలింపిక్స్ కు వెళ్లిన భారత క్రీడా మంత్రి విజయ్ గోయల్ చిక్కుల్లో పడ్డారు. భారత అథ్లెట్లను ప్రోత్సహించేందుకు అక్కడికి వెళ్లిన విజయ్ గోయల్ అనుమతి లేని వేదికల వద్దకు వెళుతుండటమే కాక, ఆయనతో పాటు అక్రిడేషన్ లేని ఇతరులను కూడా తీసుకువెళుతున్నారని ఒలింపిక్స్ నిర్వాహకులు ఆరోపించారు. మంత్రి పక్కన ఉన్నవారు ఒలింపిక్స్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని సంబంధిత అధికారులు ‘రియో’లో భారత్ తరపున చీఫ్ గా వ్యవహరిస్తున్న రాకేష్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్ ప్రాంగణం వద్ద జరిగిన ఒక ఘటనను ఆయన దృష్టికి తీసుకువచ్చారట. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ, భారత్-జపాన్ బాక్సింగ్ మ్యాచ్ సందర్భంగా క్రీడాకారులను కలుసుకునేందుకు గోయల్ ప్రయత్నించారని, అందుకు ప్రత్యేకమైన అనుమతి కావాలని తెలుసుకున్న ఆయన ఆ మ్యాచ్ అనంతరం వారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారని చెప్పారు. ‘రియో’లో విజయ్ గోయల్ తీరుకుగాను ఆయనకిచ్చిన అక్రిడేషన్ రద్దు చేస్తామని ఒలింపిక్ నిర్వాహకులు హెచ్చరించినట్లు సమాచారం.