: కృష్ణా పుష్కరాలకు తమిళనాడులోని తెలుగువారిని ఆహ్వానించలేదట!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ప్రముఖులకే కాక విదేశాల్లోని వారికి కూడా ఆహ్వానాలు పంపింది. అయితే, తమిళనాడులోని తెలుగువారికి మాత్రం సర్కారు నుంచి ఆహ్వానం అందలేదట. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలోని తెలుగు సినీ ప్రముఖులెవ్వరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పుష్కరాల ఆహ్వాన పత్రికను స్వయంగా వెళ్లి అందించారు. అయితే, అక్కడ నివసిస్తోన్న తెలుగు వారెవ్వరికీ పుష్కరాల ఆహ్వాన పత్రికలు అందలేదు. చెన్నై నగరంలో అధిక సంఖ్యలోనే తెలుగు సంస్థలున్నాయి. నగరంలో ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా), ప్రపంచ తెలుగు సమాఖ్య, అఖిల భారత తెలుగు సమాఖ్య వంటి సంస్థలతో కలిపి సుమారు వంద తెలుగు సంస్థలున్నాయి. పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అయినప్పటికీ అక్కడి తెలుగువారికి, సంస్థలకు పుష్కరాల ఆహ్వాన పత్రాలు అందలేదని సమాచారం. ప్రభుత్వం కనబర్చిన ఈ వైఖరి పట్ల అక్కడి పలువురు తెలుగు ప్రముఖులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తరఫున చెన్నైలోని తెలుగు సంస్థలన్నింటికీ కలిపి ఒకేసారి బహిరంగంగా ఆహ్వానం పలికినా తాము సంతోషించే వాళ్లమని అంటున్నారు.