: కొత్త కోణం... పాక్ ఉగ్రవాదులతోనూ చేతులు కలిపిన నయీమ్... తుపాకులిచ్చిన సలావుద్దీన్
పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తాజాగా వెలుగులోకి వచ్చింది. నయీమ్ కు ఏకే-47 తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారించగా, ఈ సంచలన విషయం బయటపడింది. పాక్ కేంద్రంగా నడుస్తూ, ఇండియాలో అశాంతిని ప్రేరేపిస్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సలావుద్దీన్ కు, నయీమ్ కు దగ్గరి బంధం ఉందని, ఆయన కాశ్మీర్ లోని తన అనుచరుల ద్వారా నయీమ్ కు ఏకే-47ను పంపాడని పోలీసులు గుర్తించారు. ఓ మార్బుల్ లోడ్ తో వస్తున్న లారీలో ఏకే-47 సహా పలు ఆయుధాలు నయీమ్ కు అందినట్టు గుర్తించారు. నయీమ్ ఉగ్రవాదులతో సంబంధాలపై సిట్ దర్యాఫ్తు చేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ లోకల్ గ్యాంగ్, భూ దందాలు, సెటిల్ మెంట్లకే పరిమితమనుకున్న నయీమ్ వెనుక ఉగ్రకోణం కూడా ఉందని తేలడం పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.