: రోశయ్యకు ఉద్వాసన... తమిళనాడు గవర్నర్ గా శంకరమూర్తి!


ప్రస్తుతం తమిళనాడుకు గవర్నర్ గా ఉన్న రోశయ్య స్థానంలో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకరమూర్తికి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ తో సైతం సత్సంబంధాలు కలిగుండటం, వివాదాలకు దూరంగా ఉంటారన్న మంచి పేరు కారణంగా శంకరమూర్తికి గవర్నర్ గా ప్రమోషన్ ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకరమూర్తి కర్ణాటక శాసన మండలికి చైర్మన్ గా ఉన్నారు. ఇటీవలి మండలి ఎన్నికల అనంతరం, సభలో బీజేపీ బలం తగ్గి, కాంగ్రెస్ పుంజుకుంది. మండలి చైర్మన్ పదవి సైతం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలోనే శంకరమూర్తి స్థాయికి తగ్గట్టు ఆయనను తమిళనాడుకు పంపాలని మోదీ భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి తమిళనాడు ఎన్నికలకు ముందే రోశయ్యను తొలగిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీ అధిష్ఠానం గవర్నర్ మార్పుపై దృష్టిని సారించలేదు. ఇక ఎన్నికలు ముగిసిన తరువాత, తమిళనాట పుంజుకునేందుకు వ్యూహ రచన చేస్తున్న మోదీ, అందులో భాగంగా తొలి ఎత్తు వేసేందుకు సిద్ధమై, తన చేతుల్లోని గవర్నర్ మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News