: స్వాతంత్ర్య వేడుకల వేళ ఎర్రకోటకు కనీవినీ ఎరుగని భద్రత... తొలిసారిగా రంగంలోకి మల్టీ టైర్ సెక్యూరిటీ వింగ్
ఉగ్రవాదుల దాడుల భయం పెరిగిన వేళ, మరో మూడు రోజుల్లో జరిగే భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడే వేళ, ముచ్చటగా మూడోసారి ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా తొలిసారిగా మల్టీ టైర్ సెక్యూరిటీ వింగ్ ను ఏర్పాటు చేశారు. డ్రోన్ డిటెక్టర్లు, పారాగ్లయిడర్లను భద్రత నిమిత్తం మొట్టమొదటిసారి ఢిల్లీలో వాడనున్నారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండే కాగితం ముక్కలనైనా గుర్తించేలా ప్రత్యేక రాడార్లను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 44 ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి, లోపలి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన మీదటే అనుమతించనున్నారు. మొత్తం 9 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించిన అధికారులు, ప్రధాని సహా వీవీఐపీల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెడ్ ఫోర్ట్ సమీపంలోని ఢిల్లీ మెట్రో టన్నెల్ ను మూసి వేయాలని నిర్ణయించారు. అత్యాధునిక ఆయుధాలు చేపట్టి కాపలాకాసే సైన్యానికి సాయంగా 500 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. 300 మంది షార్ప్ షూటర్లను రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో మోహరించనున్నారు. సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ, ఎస్ డబ్ల్యూఏటీ, బీఎస్ఎఫ్ దళాలకు చెందిన 50 మంది షూటర్లు ఎర్రకోటకు 500 మీటర్ల పరిధిలో కాపు కాయనున్నారు. ఇప్పటికే 10 సార్లకు పైగా డాగ్, బాంబ్ స్క్వాడ్ సభాస్థలిని తనిఖీలు చేశాయని సీఐఎస్ఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్)లను సిద్ధం చేశామని, సీఐఎస్ఎఫ్ నిఘా వర్గాలు సెక్యూరిటీ వలయాలపై నిత్యమూ కన్నేసి ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి రెడ్ ఫోర్టును ప్రధాని సెక్యూరిటీ వింగ్, తన పరిధిలోకి తీసుకుంటుందని, వారికి 300 మంది సీఐఎస్ఎఫ్ దళాలు సాయపడతాయని వివరించారు. ఎర్రకోటకు సమీపంలోని భవంతులపై విమాన విధ్వంసక క్షిపణులుంటాయని, 105 భవనాల కిటికీల నుంచి షార్ప్ షూటర్ల పహారా ఉంటుందని వివరించారు.