: అంతా ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే!: మరోసారి కేసీఆర్ నిప్పులు
కృష్ణా పుష్కరాలంటే విజయవాడ, గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి అంటూ ప్రచారం చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని ఆలయాలు, గుడులు, ప్రధాన నదీ ప్రవాహ ప్రాంతాలను ఆంధ్రా పాలకులు విస్మరించారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ జిల్లాలో జోగులాంబ రూపంలో శక్తి స్వరూపిణి కొలువై విరాజిల్లుతున్న అలంపురంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ ఉదయం పుష్కర స్నానం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయని గుర్తు చేసిన ఆయన, ఎన్నో కొత్త ఘాట్లను నిర్మించామని తెలిపారు. కృష్ణమ్మ ఒడిలో సైతం కొత్త ఘాట్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ గొప్పతనం మరుగున పడిపోయిందని విమర్శలు గుప్పించారు. జోగులాంబ రూపంలో ఇక్కడ ఉన్న శక్తి పీఠాన్ని సందర్శించడానికి ప్రతియేటా 5 వేల నుంచి 10 వేల మంది ఉపాసకులు వస్తుంటారని, వారికి ఏ ఇబ్బందులూ కలుగకుండా వసతి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలంపూర్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక్కడికి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచుతామని అన్నారు. ఇక్కడ 100 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు.