: ఇక దుబాయే దిక్కు.. అతి పెద్ద జెండా కోసం ఎడారి దేశం వైపు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం
దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి రికార్డు సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జెండా కోసం దుబాయ్‌వైపు చూస్తోంది. బలమైన గాలులకు త్రివర్ణ పతాకం పలుమార్లు చినిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పోచంపల్లి పట్టుతో మరో కొత్త జెండాను రూపొందించారు. అయినా ఫలితం లేకపోవడంతో దుబాయ్‌కు చెందిన చానల్ గ్రూప్ ఇంటర్నేషనల్ నుంచి జెండాను కొనుగోలు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త జెండా ఎగురవేయడం మినహా అక్కడ మరే ఇతర కార్యక్రమాలు చేపట్టడం లేదని హెచ్ఎండీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త జెండా కోసం దుబాయ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని, దాని విలువ రూ.3.2 లక్షలని పేర్కొన్నారు. అల్ట్రావైలట్(యూవీ) కోటింగ్ ఉండడం వలన ఈ జెండా రంగు మారదని, తయారీలో ట్రిపుల్ యార్న్‌ను వాడడం వల్ల బలమైన గాలులను సైతం తట్టుకునే సామర్థ్యం ఈ జెండాకు ఉంటుందని ఆయన వివరించారు.