: కాశ్మీర్ వేర్పాటు వాద నేత ప్రసంగాలతోనే తీవ్రవాదిగా మారా: పాక్ తీవ్రవాది బహుదూర్
కాశ్మీర్ వేర్పాటు వాద నేత ఆసియా ఆంద్రబీ ప్రసంగాలతోనే తాను తీవ్రవాదం వైపు మరలానని కాశ్మీర్లో ఇటీవల పట్టుబడ్డ పాకిస్థాన్ తీవ్రవాది బహుదూర్ తెలిపాడు. ఎన్ఐఏ అధికారులకు అతను వాంగ్మూలమిచ్చిన సందర్భంగా రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. కాశ్మీర్లోని 'దుఖ్తరన్ ఏ మిల్లత్' అనే మహిళా సంస్థ అధ్యక్షురాలైన ఆంద్రబి భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం చేస్తుంటుందని, గతంలో ఆమెను భారతదేశంపై యుద్ధాన్ని ప్రోత్సహించినందుకు అరెస్టు కూడా చేశారని బహుదూర్ గుర్తు చేశాడు. అంతే కాకుండా ఆమె గత ఏడాది జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ జెండాను బహిరంగంగా ఎగురవేసి తమలాంటి వారిలో స్పూర్తిని నింపిందని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ లో బీఫ్ హత్య జరిగిన సందర్భంగా, గో హత్య నిషేధాన్ని నిరసిస్తూ, తాను గోహత్య చేస్తున్నట్లు వీడియోను తీయించుకుని ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరిందని ఆయన తెలిపాడు. కాగా, ఈ వీడియో జమ్మూకాశ్మీర్ లోని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేసింది. ఆమె చర్యలు, ప్రసంగాలే తనను తీవ్రవాదంవైపు మరలేలా చేశాయని ఆయన తెలిపాడు. భారత్ లో తీవ్ర విధ్వంసం సృష్టించాలనే వచ్చానని బహుదూర్ స్పష్టం చేశాడు.