: మహిళ ఫోన్ కాల్ తో మోసపోయి రూ. 25 లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి!


ఓ మహిళ ఫోన్ చేసి, తానో రియల్ ఎస్టేట్ వ్యాపారినని, ఎన్నో భవంతులు కట్టిస్తున్నానని చెప్పిన మాయమాటలు విని మోసపోయిన ఓ సిమెంట్ వ్యాపారి రూ. 25 లక్షలు పోగొట్టుకున్న ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని పనయార్ ఖాయిదేమిల్లత్ రోడ్డులో కాళేశ్ అనే వ్యాపారి భవన నిర్మాణ వ్యాపారం చేస్తున్నాడు. అదే వీధిలో డ్రైవర్ గా ఉండే ఆనంద్ అనే వ్యక్తి వచ్చి 600 సిమెంట్ బస్తాలకు ఆర్డర్ ఇచ్చాడు. నగదును అడిగిన కాళేశ్ తో తన యజమానితో మాట్లాడాలని చెప్పాడు. ఆపై అరుణ అనే పేరుతో పరిచయమైన మహిళ, తాను రాష్ట్రంలో ఎన్నో బిల్డింగ్ కాంట్రాక్టులు చేస్తున్నానని, పెద్ద మొత్తంలో సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ కావాల్సి ఉంటుందని, అంతా నీ వద్దే కొంటానని మాయమాటలు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన కాళేశ్, వివిధ దఫాలుగా రూ. 25 లక్షల విలువైన సరుకు ఇచ్చాడు. డబ్బుకోసం నిలదీసిన వేళ, ఆమె తప్పించుకుంది. దీంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, డ్రైవర్ ఆనంద్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరుణ పరారు కాగా, ఆమె కోసం వెతుకుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News