: మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతున్న వారికి తీపికబురు.. కిడ్నీల్లో రాళ్లను కరిగించే కొత్త మందు!


కిడ్నిల్లో రాళ్లు ఏర్ప‌డ‌డంతో అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న వారికి హ్యూస్టన్ విశ్వవిద్యాలయ ప‌రిశోధ‌కులు తీపి క‌బురు తెలిపారు. ఇప్పటివరకు కిడ్నీలలో రాళ్ల‌ను కరిగించేందుకు చేస్తున్న చికిత్సకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ప‌ధ్ధ‌తిని ప‌రిశోధ‌కులు క‌నిపెట్టారు. కిడ్నిలోని రాళ్లను హైడ్రాక్సీ సిట్రేట్ రసాయనం ఇట్టే కరిగిస్తుందని వారు స్పష్టం చేశారు. కొన్ని రకాల పండ్లలో ఈ ర‌సాయ‌నం ల‌భిస్తుంద‌ని వారు పేర్కొన్నారు. కాల్షియం ఆక్సలేట్ కారణంగా వచ్చే ఈ కిడ్నీ రాళ్లను నివారించాలంటే డాక్ట‌ర్లు ప‌లు సూచన‌లు చేస్తుంటారు. ప్ర‌తిరోజు నీరు ఎక్కువగా తాగాలని వారు సూచిస్తారు. ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే పాలకూర, టమోటాలకు దూరంగా ఉంటూ పొటాషియం సిట్రేట్ అధికంగా ఉండే పండ్లు తినాల‌ని పేర్కొంటారు. అయితే, పొటాషియం సిట్రేట్‌తో వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని నివారించ‌డానికే వారు మ‌రో ప‌ధ్ధ‌తిని క‌నుగొన్నారు. హైడ్రాక్సీ సిట్రేట్ ఉన్న పండ్లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ పండ్ల‌తో కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయ‌ని వారు క‌నుగొన్నారు. దీని కోసం కిడ్నీలో రాళ్లతో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారిపై తాము ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్లు, హైడ్రాక్సీ సిట్రేట్ మందును వారికి ఇవ్వ‌గా మంచి ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్లు జెఫ్రీ రిమ్మర్ అనే ప‌రిశోధ‌కుడు పేర్కొన్నారు. త‌మ‌ పరిశోధనలు మ‌రింత ముందుకు కొన‌సాగించి దీనిక‌న్నా మ‌రింత మెరుగైన మందును తయారు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News