: తప్పు చేస్తే జైల్లో కూర్చుంటా!... జ్యూడీషియల్ ఎంక్వైరీ చేయాలని ఉమా మాధవరెడ్డి డిమాండ్!
గ్యాంగ్ స్టర్ నయీమ్ తో సంబంధాలున్నట్లు వచ్చిన వార్తలపై టీడీపీ దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం స్థానిక, నేషనల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాదులోని తన నివాసంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. తప్పు చేస్తే జైల్లో కూర్చుంటానని ఆమె విస్పష్ట ప్రకటన చేశారు. తన భర్త మాధవరెడ్డికి ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. నయీమ్ తో సంబంధాలున్న తమ వారిని రక్షించుకునేందుకే తమను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది సౌమ్యమైన కుటుంబమని చెప్పిన ఉమా మాధవరెడ్డి... తమ కుటుంబంపై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు. నయీమ్ ఫోన్ నుంచి తనకు వందలాది కాల్స్ వచ్చాయన్న కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... తన భర్త బతికి ఉన్నప్పటి నుంచి తమ నెంబరే మారలేదని చెప్పారు. తమను, తమ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వం లీకులిచ్చి మరీ వార్తలు రాయిస్తోందని ఆమె చెప్పారు. తమ కుటుంబ చరిత్ర ఏమిటో ఒక్క తెలంగాణ ప్రజలకే కాకుండా ఏపీ ప్రజలకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్ తో దర్యాప్తు చేయడం సరికాదని, జ్యూడీషియల్ విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. జ్యూడీషియల్ ఎంక్వైరీతోనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె చెప్పారు. స్థానిక మీడియాలో పరోక్షంగా కథనాలు వస్తే... నేషనల్ మీడియాలో తన పేరు పెట్టి మరీ కథనాలు రాసిన కారణంగానే తానీ వివరణ ఇస్తున్నానని ఆమె చెప్పారు. తన భర్త మరణంతో ఇప్పటికే నానా ఇబ్బందులు పడిన తమను మరింత ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం యత్నిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.