: తల్లిపాలతో లాభమే కాదు.. నష్టం కూడా ఉందట.. స్పష్టం చేసిన పరిశోధకులు!
తల్లిపాలు చిన్నారుల ఆరోగ్యానికి ఎంత ముఖ్యమైనవో మనకు తెలుసు. ప్రపంచ తల్లిపాల దినోత్సవం అంటూ వాటిపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. పిల్లలకి తల్లిపాలే శ్రేష్ఠమైనవని తెలియజెప్పేందుకు వైద్యులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడమే ఇంతవరకు చూశాం. అయితే అదే తల్లిపాల విషయంలో తాజాగా పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని తెలిపారు. తల్లిపాల ద్వారా చిన్నారుల్లో ఒత్తిడి(స్ట్రెస్) కూడా కలిగే అవకాశం ఉందట. ఈ విషయాన్ని భారతసంతతి శాస్త్రవేత్తతో కూడిన న్యూజీలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ పరిశోధకులు తేల్చి చెప్పారు. పాలలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్లు ఉండడమే దీనికి కారణమని వారు అంటున్నారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ప్రసవం జరిగిన తల్లుల పాలలో, ఇంట్లో భర్త తోడ్పాటు లేకుండా ఒంటరిగా బిడ్డ సంరక్షణలో ఉండే తల్లుల పాలలో ఈ హార్మోన్లు అధికంగా ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మూడు, నాలుగు నెలల వయసు బిడ్డలు ఉన్న 650 మంది తల్లుల పాలను తీసుకుని తాము చేసిన పరిశోధనల ద్వారా ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. కార్టిసోల్ మనలో భావోద్వేగాల నియంత్రణ, పెరుగుదలకు ప్రధానమైన హార్మోన్. ఈ హార్మోన్ మన శక్తిని కండరాల తయారీకి కాకుండా కొవ్వు తయారీకి ప్రేరేపిస్తుందని వారు పేర్కొన్నారు. దీంతో ఈ కార్టిసోల్ చిన్నారుల్లో ఉంటే దాని ప్రభావం మరింత ఉంటుందని చెబుతున్నారు. ఈ హార్మోన్లు అవసరమైన స్థాయికి మించితే పిల్లల్లో ఒత్తిడికి కారణమవుతుందని, ఒత్తిడితో పిల్లల్లో నిరాశ, చిరాకు వంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయని వారు పేర్కొన్నారు. కార్టిసోల్ గురించి తాము ఎలుకలు, కోతులపై జరిపిన పరిశోధనలో ఈ అంశం స్పష్టమయిందని తెలిపారు.