: స్పష్టత లేకుండా జీవోలెలా ఇస్తారు?... తెలంగాణ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేసింది. స్పష్టత లేకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని అడ్వొకేట్ జనరల్ ను నిలదీసిన ప్రభుత్వం పూర్తి వివరాలతో మరోమారు తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం 123 జీవోను ప్రయోగించాలని నిర్ణయించింది. అయితే నిర్వాసితుల అభ్యంతరంతో హైకోర్టు సింగిల్ బెంచ్ తెలంగాణ సర్కారుకు షాకిస్తూ సదరు జీవోను రద్దు చేసింది. అయితే నిన్న ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో నేటి విచారణకు పూర్తి వివరాలతో హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలతో అడ్వొకేట్ జనరల్ సర్వం సిద్ధం చేసుకునే వచ్చారు. ప్రభుత్వం అందజేసిన అన్ని వివరాలతో కోర్టుకు వచ్చిన ఆయనపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి జారీ చేసిన జీవోలో అసలు స్పష్టతే లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 16న జరగనున్న తదుపరి విచారణకు సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఏజీకి సూచించింది.