: మద్యం తాగొద్దని భర్త హెచ్చరించినందుకు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న మహిళ
మద్యానికి బానిసయిపోయింది. దాన్ని ముట్టుకోవద్దంటే వినలేదు. భర్త తీవ్రంగా మందలించడంతో మద్యాన్ని వదులుకోలేక యాసిడ్ తాగి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గోల్నాకలోని భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన చెరుకుపల్లి రాములమ్మ(25) అనే ఓ మహిళ ఈ ఘటనకు పాల్పడింది. కూలి పని చేసుకునే ఆమెను భర్త శ్రీను తాగొద్దని హెచ్చరించాడని, అయినా ఆమె వినకపోవడంతో మరోసారి ఆమెపై మండిపడ్డాడని దీంతో యాసిడ్ తాగిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాములమ్మ యాసిడ్ తాగి ఇంట్లోనే పడి ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకి ఫోన్ చేసి ఆమె గురించి చెప్పారు. పోలీసులు రాములమ్మను ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.