: ప్రతి ఒక్కరూ లంచాలడిగారు... ఇచ్చుకోలేక బిడ్డను కోల్పోయామని రోదిస్తున్న కన్న తల్లి!


ప్రభుత్వాసుపత్రిలో అధికారుల నుంచి వార్డు బాయ్ లు, స్వీపర్ల వరకూ లంచాలు అడుగుతున్న వేళ, వాటిని ఇచ్చుకోలేక తమ బిడ్డను కోల్పోయామని రోదిస్తోంది ఓ కన్న తల్లి. ఈ ఘటన యూపీ రాజధాని లక్నోకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహరైచ్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడికి సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న సుమిత, శివ్ దత్ దంపతుల పది నెలల బిడ్డ కృష్ణ, తీవ్ర జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతుండగా, ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. బిడ్డను చూసిన డాక్టర్ అడ్మిట్ చేయాలని సూచించడంతో, వీరికి తొలి లంచావతారం, నర్సు రూపంలో తగిలింది. అడ్మిట్ డాక్యుమెంట్ల కోసం ఆమెకు లంచమిచ్చిన తరువాత, చిన్నారుల వార్డులోని స్వీపర్, బాబును మంచంపై పడుకోబెట్టనిచ్చేందుకు మామూలు అడిగింది. ఆమెకూ లంచమిచ్చిన తరువాత వచ్చిన అసలు సమస్య మెడికల్ అసిస్టెంట్ రూపంలో ఎదురైంది. బాబుకు ముఖ్యమైన ఇంజక్షన్ చేయాలని, ఇంజక్షన్ చేసేందుకు డబ్బివ్వాలని అతను కోరాడు. ఆ సమయంలో తన చేతిలో డబ్బులేదాని సుమిత చెప్పింది. "నాకు కొంచెం సమయం ఇవ్వాలని వారిని కోరాను. అతను అడిగినంత డబ్బూ ఇస్తానని చెప్పాను. అతను వినలేదు" అని చెప్పింది. ఆపై చాలా సేపటికి ఇంజక్షన్ చేసి వెళ్లాడు. కానీ ఆలస్యం కావడంతో బిడ్డ దక్కలేదని వాపోయింది. ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు మినహా ప్రతి ఒక్కరూ లంచాలు అడిగారని, రోజు కూలీగా పనిచేస్తున్న తాము, వారికి డబ్బిచ్చుకోలేక బిడ్డను కోల్పోయామని శివ దత్ తెలిపాడు. ఇంజక్షన్ చేయడం ఆలస్యమైందంటూ, సుమిత చేసిన ఆరోపణలను ఖండించిన ప్రధాన డాక్టర్ ఓపీ పాండే, లంచాలు తీసుకున్న స్వీపర్, నర్సులను తొలగించామని, విచారణ జరుగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News