: పఠాన్ కోట్ అమరవీరుడి ఇల్లును కూల్చివేయనున్న సిద్ధరామయ్య సర్కారు!


లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్... 34 ఏళ్ల ఈ యువ సైనికుడు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లో విధులు నిర్వహిస్తూ పఠాన్ కోట్ ఉగ్రదాడిలో దేశంకోసం ప్రాణాలు అర్పించి అమరుడయ్యాడు. జనవరి 2న పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేయగా, ఆపై వారు విసిరిన పేలని గ్రనేడ్ ను నిర్వీర్యం చేస్తూ, ప్రాణాలు వదిలాడు. అతని కుటుంబం బెంగళూరులో నివాసం ఉంటుండగా, ఇప్పుడు వారు రోడ్డుమీద పడే పరిస్థితికి చేరారు. ఇటీవలి వర్షాలకు బెంగళూరు నగరాన్ని వరద నీరు ముంచెత్తిన తరువాత, కదిలిన సిద్ధరామయ్య సర్కారు నీటి కాలువలకు అడ్డుగా ఉన్న 1,100 గృహాలను యుద్ధ ప్రాతిపదికన కూల్చి వేయాలని నిర్ణయించగా, ఆ జాబితాలో నిరంజన్ కుమార్ ఇల్లు కూడా ఉంది. "నా సోదరుడిని కోల్పోయాను. ఇప్పుడు ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఇంటి కూల్చివేతను ఆపాలని కోరుకుంటున్నాను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు ఇదేనా మాకు బహుమానం. సిగ్గుచేటు" అని నిరంజన్ సోదరుడు శశాంక్ విమర్శించారు. ఇదే విషయమై మునిసిపల్ కమిషనర్ మంజునాథ ప్రసాద్ స్పందిస్తూ, "వారి పట్ల నాకు సానుభూతి ఉంది. అయితే, ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మనసుకు కష్టమనిపించినా కూల్చివేత తప్పదు" అనడం గమనార్హం. కాగా, ప్రస్తుతం బెంగళూరు పరిధిలోని బొమ్మనహళ్ళి, మహదేవపురా, యహలంక ప్రాంతాల్లో ఇళ్లు కూల్చివేతలు జరుగుతుండగా, గడచిన మూడు రోజుల్లో 100కు పైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు.

  • Loading...

More Telugu News