: అమెరికన్ పేరుతో హైదరాబాద్ యువతిని ముంచిన నైజీరియన్


నైజీరియన్ల మోసానికి మరో హైదరాబాద్ యువతి బలైంది. తనను తాను అమెరికన్ సోల్జర్‌గా చెప్పుకున్న నైజీరియన్ ఫేస్‌బుక్ ద్వారా భాగ్యనగరి యువతికి వలవేశాడు. చిక్కిన ఆమె నుంచి తెలివిగా రూ.2.5 లక్షలు కొట్టేశాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నైజీరియాకు చెందిన ఒమెలెజ్ ఫ్రెడ్(35) 2012 నుంచి ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో పలు ఖాతాలు తెరిచిన ఫ్రెడ్ పలువురు అమ్మాయిలకు గాలం వేశాడు. అతడి గాలానికి హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కూడా చిక్కుకుంది. బెన్సన్ పేరుతో ఆమెకు పరిచయమైన ఫ్రెడ్.. తాను అమెరికా సోల్జర్‌నని, ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో పనిచేస్తున్నట్టు చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. తన వద్ద ఉన్న ఐదు మిలియన్ డాలర్లను ఇండియాలో పెట్టుబడి పెట్టి సెటిలైపోదామని నమ్మబలికాడు. ఈ క్రమంలో జూలై 8న యువతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌గా చెప్పుకునే మహిళ బెన్సన్ అనే వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయంలో డబ్బు, బంగారంతో పట్టుబడ్డాడని తెలిపింది. రూ.2.5 లక్షలు కడితే విడిచిపెడతామని పేర్కొంది. నమ్మిన యువతి వెంటనే ఆ మొత్తాన్ని ఆమె చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతే.. ఆ తర్వాత ఫ్రెడ్‌తో కమ్యూనికేషన్ ఆగిపోయింది. మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఢిల్లీలో ఫ్రెడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఐదు లక్షల మంది భారతీయుల ఫోన్ నంబర్లు, లక్ష ఈమెయిల్ అడ్రస్‌లను పోలీసులు గుర్తించి ఆశ్చర్యపోయారు.

  • Loading...

More Telugu News