: శ్రీశైలానికి భారీ వరద... 2.5 లక్షల క్యూసెక్కులు... మరో 16 అడుగులే ఖాళీ!
ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులైన ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారుతోంది. ఈ ఉదయం శ్రీశైలానికి వస్తున్న నీటి ప్రవాహం 2,49,544 క్యూసెక్కులుగా నమోదైంది. మొత్తం 885 అడుగుల మేరకు నీటి నిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్ లో ప్రస్తుతం 868.80 అడుగుల మేరకు నీరుంది. జలాశయంలో మరో 16 అడుగులు మాత్రమే ఖాళీ వుంది. శ్రీశైలంలోని కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లోని 12 యూనిట్లనూ అధికారులు స్టార్ట్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీంతో 75,527 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తూ నాగార్జున సాగర్ కు తరలుతోంది.