: న్యూస్ ఛానెల్ లో నయీమ్ ఎన్ కౌంటర్ దృశ్యాలు!


కరుడుగట్టిన నేరగాడిగా మారిన తెలంగాణ పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ నాలుగు రోజుల క్రితం పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఓ భూదందాను సెటిల్ చేసేందుకు షాద్ నగర్ వచ్చిన నయీమ్ అనుచరవర్గంతో కలిసి కారులో అక్కడికి చేరుకున్నాడు. అయితే అప్పటికే అతడి రాకపై స్పష్టమైన సమాచారం సేకరించిన తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడ మాటు వేశారు. కారు దిగకముందే గ్రేహౌండ్స్ కదలికలను పసిగట్టిన నయీమ్... తప్పించుకునే యత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా, నయీమ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సమయంలో అతడి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల మెరుపు దాడితో భయభ్రాంతులకు గురైన నయీమ్ అనుచరులు నేలపై పడుకుని రెండు చేతులు పైకెత్తి లొంగిపోయారు. తమ బాస్ నిర్జీవంగా పడి ఉన్న ప్రదేశానికి అత్యంత సమీపంలోనే నయీమ్ అనుచరులు నేలపై పడుకుండిపోయారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ ఆపరేషన్ లో గ్రేహౌండ్స్ కు చెందిన ఆరుగురు పోలీసులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News