: గో రక్షకులకు ఐడీ కార్డులు.. హర్యాణా కౌ కమిషన్ యోచన


గోరక్షకులకు ఐడీ కార్డులు ఇవ్వాలని హర్యాణా కౌ కమిషన్ యోచిస్తోంది. గోరక్షకుల ముసుగులో అసాంఘిక శక్తులు అరాచకాలకు పాల్పడుతున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ గో రక్షకులకు అడ్డుకట్ట వేయాలని భావించిన హర్యాణా కౌ కమిషన్ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. గో రక్షకుల పేరుతో కొందరు నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారని కౌ కమిషన్ చీఫ్, ఆరెస్సెస్ నేత బాని రామ్ మంగ్లా తెలిపారు. ఆవులను తరలిస్తున్న వాహనాలను ఆపి ఒక్కో వాహనం నుంచి రూ. 8 వేలు చొప్పున వసూలు చేస్తున్న నకిలీ గోరక్షక ముఠాను ఏప్రిల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నకిలీ’లకు చెక్ పెట్టేందుకు ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. హర్యాణాలో మొత్తం వందమంది గో రక్షకులు ఉన్నారని మంగ్లా తెలిపారు. వారి పేర్లతో కూడిన జాబితా తమకు అందిందని వారి గురించి గో రక్షాదళ్ పూర్తిగా నిర్ధారించుకున్నాక ఐడీ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆవులను తరలిస్తున్న ట్రక్కులను ఆపే హక్కు గో రక్షకులకు లేదని, ఏదైనా అనుమానం వస్తే కౌ ప్రొటక్షన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News